చేతివాటం కారణంగానే రాష్ట్రంలో చీకట్లు
Exminister Kala Venkatrao Fires On CM Jagan. ముఖ్యమంత్రి అసమర్ధత, అవినీతితో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు
By Medi Samrat Published on 16 Oct 2021 6:14 PM ISTముఖ్యమంత్రి అసమర్ధత, అవినీతితో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. నాడు విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధిస్తే.. నేడు చేతకానితనంతో పొరుగు రాష్ట్రాల నుండి యూనిట్ రూ.20 చొప్పున కొనుగోలు చేసే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. రైతు రాజ్యం తీసుకొస్తానని కోతల రాజ్యం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. రేషన్, పెన్షన్ లబ్దిదారుల కోత కోస్తూ.. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తున్నారని మండిపడ్డారు.
దక్షిణాధి రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి.? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా.. ఆ భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన వేసి వేధించడం అసమర్ధత కాదా.? అని నిలదీశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా.. వినియోగదారుల నుండి కనీస వినియోగ ఛార్జీ ఏ విధంగా వసూల్ చేస్తారు.? అని ఎండగట్టారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సుస్థిరంగా ప్రగతి బాటలో నడిపేందుకు దోహదపడే విద్యుత్ రంగాన్ని రెండున్నరేళ్లలో విచ్ఛిన్నం చేయడంతో సాధించిందేంటి అని ప్రశ్నించారు.
సంప్రదాయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా సోలార్, విండ్ వ్యవస్థలను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. అధికారంలోకి వచ్చీ రాగానే ఆ ఒప్పందాలు రద్దు చేసిన ఫలితమే నేటి విద్యుత్ కోతలు కాదంటారా.? ప్రతి ఇంట్లో నాలుగు బల్బులు, రెండు ఫ్యాన్లు, అవసరమైతే ఏసీ కూడా ఆన్ చేసుకునేలా విద్యుత్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి.. ఇప్పుడు కనీసం విద్యుత్ సరఫరానే లేకుండా చేయడం చేతకానితనం కాదా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను మూసివేత దిశగా తీసుకెళ్లి.. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ లో బినామీ పేర్లతో నడుపుతున్న జగన్ రెడ్డి విద్యుత్ కేంద్రాల నుండి కొనుగోలు చేయాలనుకోవడం వాస్తవం కాదా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూజా, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి 6 నెలలుగా విద్యుత్ కొనుగోలు చేయకుండా నిలుపుదల చేయడం వెనుక ఆంతర్యమేంటి.? అని ప్రశనించారు.
జే-ట్యాక్స్, అవినీతి, దుబారా కోసం ప్రజలను బలి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు విద్యుత్ వాడకం తగ్గించుకోవాలని, ఫ్యాన్లు, ఏసీల వినియోగం ఆపాలని అధికారికంగా ప్రకటించే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. చివరికి పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రగతిని ప్రశ్నార్ధకం చేస్తున్నారని దుయ్యపట్టారు. ఉద్దరిస్తానని అధికారంలోకి వచ్చి.. రాష్ట్రాన్ని సాంతం ఊడ్చేసి జేబులు నింపుకోవడం అత్యంత హేయమని తీవ్రవ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా సొంత ప్రయోజనాలు వీడి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారు.