మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను సీఎం చేయాలని సోనియాను స్వయంగా అడిగినప్పుడో, ఇతరులతో అడిగించినప్పుడో జగన్ లో ఎలాంటి ఫీలింగ్ ఉందో... ఇప్పుడు టికెట్ మార్చిన ఎమ్మెల్యేల్లోనూ అలాంటి బాధాకరమైన ఫీలింగే ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకు మరో చోట టికెట్ మార్చడం ఎంతో కష్టమైన పని అని, ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అని తెలిపారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ సీఎం జగన్ ఆలోచనలు చూస్తే అలా కనిపించడంలేదని అన్నారు. సీటు లేదని చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలని.. అలాంటి అనుభవం జగన్‌కి ఉందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు అధికారం అంతా జగన్ కు, వాలంటీర్లకు మధ్యనే ఉందని, మరి ఎమ్మెల్యేలకు అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కనిపిస్తోందని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం టీడీపీకి బలమేనని చెప్పారు. రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారని వ్యాఖ్యానించారు. అప్పులు చేసి పంచిపెట్టడం ఎక్కడా చూడలేదని అన్నారు.