మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించనుంది. నేడే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. బెంచ్ లోని మరో న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగానే తీర్పును వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా ప్రకటించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు.
వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 19వ తేదీన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అరెస్టైన ఎర్రగంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు.ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని కోరుతూ సీబీఐ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి 16న కొట్టివేసింది. ఎర్రగంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలకు బలం చేకూరేలా సీబీఐ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించకపోవడంతో బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో సీబీఐ గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను కూడా జస్టిస్ ఎంఆర్ షా ఈ నెల 21కి వాయిదా వేశారు.