కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి రమేష్ ఫైర్
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే
By Medi Samrat Published on 13 Aug 2024 8:30 AM GMTమాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. జోగి రమేష్‌పై కోపంతో కూటమి ప్రభుత్వం అతని కుమారుడు రాజీవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ విమర్శలు చేసింది. ఇబ్రహీంపట్నంలో ఉదయం నుంచి జోగి రమేష్ ఇంటి వద్ద ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. జోగి రమేష్ ఇంట్లో సోదాలు జరిగిన అధికారులు అనంతరం ఆయన తనయుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించింది.
ఈ విషయమై జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలంటే ఎందుకు చంద్రబాబు నీకు ఇంత కక్ష? నీకు కుమారుడు ఉన్నాడనే విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తు చేశారు. అంచలంచెలుగా ఎదిన ఓ బీసీ సామాజికవర్గం గౌడ కులంకు చెందిన వ్యక్తిపై ఎందుకు అంత కక్ష సాధింపు అని మండిపడ్డారు. కోపముంటే నాపై కక్ష తీర్చుకో చంద్రబాబు.. నా కొడుకు రాజీవ్ ఏం పాపం చేశాడు.? అని ప్రశ్నించారు. మా అబ్బాయి విదేశాల్లో ఉన్నత విద్య చదివి.. అక్కడే ఉద్యోగం కూడా చేశాడు. కానీ ఈరోజు అన్యాయంగా నా కొడుకుని అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసి ఉంటే విజయవాడ నడిరోడ్డుపై మేము ఉరి వేసుకుంటామన్నారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని ఇలా కక్ష సాధింపు తగదు చంద్రబాబు.. నీకూ ఒక కొడుకు ఉన్నాడు. ఇలా తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు.. ఇప్పటికైనా నీ వంకర బుద్ధిని మార్చుకో అని సూచించారు.