ప్రతిపక్షాల కుయుక్తులను ఎవరూ నమ్మరు

Ex Minister Dharmana Krishna Das Comments On TDP. ప్రతిపక్షాలు అధికార దాహంతో చేస్తున్న విషప్రచారాలను, కుయుక్తులను ఎవరూ

By Medi Samrat  Published on  6 Jun 2022 7:16 AM GMT
ప్రతిపక్షాల కుయుక్తులను ఎవరూ నమ్మరు

ప్రతిపక్షాలు అధికార దాహంతో చేస్తున్న విషప్రచారాలను, కుయుక్తులను ఎవరూ నమ్మరని మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం పోలాకి మండలంలో తన స్వగ్రామమైన మబుగాం పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అదే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని చెప్పారు. అందులో భాగంగానే గత మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలుసుకుంటూ ఈ పథకాలపై సమీక్ష చేస్తున్నామన్నారు. ఇంకెక్కడైనా అర్హులకు పథకాలు చేరకపోయినా, అనర్హులకు ఇవి చేరినా వాటిని సమీక్షించి తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం సుశిక్షుతులైన కార్యక‌ర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. కార్యకర్తలు, గ్రామ, వార్డు వాలంటీర్ల సంయుక్త కృషితోనే సుపరిపాలన అందుతోందని తెలిపారు.

విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడూ సంక్షేమంలో అత్యంత కీలకమైనవి కాబట్టే వీటికి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మహత్తరమైన సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. నాటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో ఆయన తనయుడు జగన్ వీటిని సమర్ధవంతంగా అమలుచేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజల మనసులో తన పాలనతో ఒక ముద్ర వేసిన జగన్‌ను తక్కువ చేస్తూ ప్రతిపక్షాలు ఎన్నికలలో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మళ్లీ సీఎంగా వైఎస్ జగనే ఉంటారని ఇది ప్రజలందరి అభీష్టమని తెలిపారు. స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు.. ఏ ఎన్నికల్లో అయినా టీడీపీకి పరాజయం తప్పదని రుజువైందన్నారు. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకుని కువిమర్శలు కట్టిపెడితే మంచిదని ధర్మాన కృష్ణదాస్ ప్రతిపక్షాలకు హితవు ప‌లికారు.












Next Story