ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్, జిల్లాకు చెందిన కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో విభేడాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. నెల్లూరులో మంత్రి అభినందన సభ రోజే.. అనిల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం కూడా కాక రేపింది. ఈ సందర్భంగా అనిల్, కాకాణి ఇద్దరూ పేర్లు ప్రస్తావించకుండానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం ఇద్దరు నేతలు వచ్చి సీఎం జగన్‌ను కలవాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అనిల్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నేరుగా జగన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాకాణితో తనకున్న విభేదాలపై జగన్‌కు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.
గొడవలే గొడవలు.. మరింత రచ్చ కూడా :
మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో సభ నిర్వహిస్తున్న సమయంలోనే దానికి పోటీగా అనిల్ మరో సభను నిర్వహించారు. ఫ్లెక్సీలకు సంబంధించి కూడా రచ్చ జరిగింది. కాకాణి గురించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. వచ్చి తనను కలవాలంటూ కాకాణి, అనిల్ కు ఆదేశాలు జారీ చేశారు.