సలాం కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందజేత
Ex Gratia Given Nandyal Family Suicide Victims. కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణం ములసాగరంలో భార్య పిల్లలతో ఆత్మహత్య
By Medi Samrat Published on 12 Nov 2020 8:53 AM GMTకర్నూల్ జిల్లా నంద్యాల పట్టణం ములసాగరంలో భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన ఆర్థిక సహాయం రూ. 25,00,000/- ల బ్యాంక్ చెక్ ను సలాం అత్తగారిని కలిసి గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు ఎక్స్‌గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేశారు.
ఇదిలావుంటే.. అబ్దుల్‌సలామ్ (45) తన భార్య నూర్జహాన్ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్ (10)తో కలిసి ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రూ.70 వేలు పోగొట్టుకున్న కేసులో విచారణ నిమిత్తం పోలీసులు అబ్దుల్ సలామ్‌ను స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. ఈ పరిస్థితుల్లో తాను బతకడం అనవసరం అనుకున్న సలామ్.. కుటుంబంతో కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్య చేసుకునే ముందు సలామ్, అతని భార్య నూర్జహాన్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆ సెల్‌ఫోన్‌ను ఇంట్లో పెట్టారు. ఆ దొంగతనంతో నాకు సంబంధం లేదని.. ఈ విషయంలో పోలీసుల టార్చర్ భరించలేకపోతున్నాని.. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని.. మా చావుతోనైనా మనశ్శాంతి కలుగుతుందని ఆ వీడియోలో వాపోయారు. దీనిపై స్పందించిన సీఎ జగన్ వెంటనే ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ కేసు విషయమై నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేశారు.