ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నామని.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీ ఇచ్చారని.. కానీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశారని.. ఇప్పుడు నిలబెట్టుకునేలా లేరన్నారు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని తనపై కూడా ఒత్తిడి తెచ్చారని.. అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవడం సరైందని కాదని తాను భావించానన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తోందని.. కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోందన్నారు వైఎస్ జగన్. కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారని.. ప్రజలే మనకు శ్రీరామ రక్షగా ఉంటారన్నారు. విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయని వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ గురువారం నాడు సమావేశమయ్యారు.