ఏపీ ప్రభుత్వం నవరత్నాల మీద ఎంతగా దృష్టి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో నవరత్నాలను ప్రచారంలో వాడుకునే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే..! అలా నవరత్నాలను అమలు చేయడమే పనిగా ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. తాజాగా నవరత్నాలు, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిం పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. షార్ట్ ఫిలిం పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు సంస్థ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ పోటీలో పాల్గొనేవారు నవంబర్ 30వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ను డీవీడీ లేదా పెన్ డ్రైవ్ లేదా బ్లూరే ఫార్మాట్ లో డిసెంబర్ 31లోగా సంస్థ కార్యాలయానికి పంపాలని కోరింది. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింలను తెలుగులో రూపొందించాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివి ఉండాలి. మరిన్ని వివరాలకు www.apsftvtdc.in ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.