ఏపీ ప్రభుత్వానికి మరో సమ్మె సమస్య
రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు విఫలమైన
By Medi Samrat
రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆగస్టు 10 నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయాలని ప్రకటించారు. జులై నెలాఖరు నుంచే విధులకు నల్ల బ్యాడ్జీలతో హాజరవుతున్న విద్యుత్ ఉద్యోగులు, తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.
ఆగస్టు 9న పెన్ డౌన్, మొబైల్ ఫోన్ డౌన్ చేయనున్నారు. బుధవారం సాయంత్రం లోపు అధికారిక సిమ్ లు ఇచ్చివేయనున్నారు. అత్యవసర సేవలకు మినహాయించి, మిగతా విధులకు దూరం కానున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో, విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 8న విద్యుత్ జేఏసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గింది. మహాధర్నా విరమించుకుంటున్నట్టు జేఏసీ తెలిపింది. శాంతియుతంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
1999లో వేతన సవరణ సహా ఇతర డిమాండ్ల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు చేశారు. మళ్లీ 24 ఏళ్ల తర్వాత సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వేతన సవరణ సహా 12 డిమాండ్లతో ఉద్యోగులు గత కొంత కాలంగా నిరసనలకు చేస్తున్నారు. సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లో భోజన విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసన ప్రదర్శనల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా చేరారు.