72 గంట‌ల‌ ముందే ప్రచారం నిలిపివేయండి

EC Restrictions On Political Campaigns. ఈనెల 30వ తేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న విష‌యం తెలిసిందే

By Medi Samrat
Published on : 22 Oct 2021 9:03 AM IST

72 గంట‌ల‌ ముందే ప్రచారం నిలిపివేయండి

ఈనెల 30వ తేదీన కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 72 గంట‌ల‌ ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7గంట‌ల నుండి 30వ తేదీ సాయంత్రం 7 గంట‌ల వరకూ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మార్గాల్లోనూ ప్రచారం చేయడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు.

1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 126(1)(బి) ప్రకారం పోలింగ్ సమయం ముగిసే 72 గంట‌ల ముందు ఎన్నికల ప్రచారానికి సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సినిమాటోగ్రఫీ, టెలివిజన్ చానళ్ళు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా గాని ఎలాంటి ప్రచారాలు నిర్వహించడానికి వీలులేదని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ ముగిసేవ‌ర‌కూ ఒపీనియన్ పోల్ లేదా పోల్ సర్వేకు సంబంధించిన వివరాలను గాని ఎలక్ట్రానిక్‌ మీడియా చానళ్ళ ద్వారా ప్రచారం చేయడాన్ని నిషేధించడం జరిగిందని సిఇఓ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ విషయమై రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమీషనర్ ను అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు.


Next Story