ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మరో సారి భూప్రకంపనలు వచ్చాయి. రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుండి భూమి కంపిస్తోంది. రామకుప్పం మండల పరిధిలోని పెద్దగరికపల్లి, గొరివిమాకుల పల్లి, కృష్ణ నగర్, యనాది కాలనీ, గెరిగి పల్లె, గడ్డురు ప్రాంతాల్లో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. భారీ శబ్దాలతో భూప్రకంపనలు వచ్చాయి. భూమి లోపల పొరల నుండి విపరీతమైన శబ్దాలు వినబడుతున్నాయి. భూమి కంపిస్తుండటంతో అక్కడి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. భూప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు ఇళ్లు వదిలి పంట పొలాల్లోకి పరుగులు తీశారు. భూమి లోపలి నుండి వస్తున్న భారీ శబ్దాలతో పలు ఇళ్ల గోడలకు చీలికలు వచ్చాయి. ఇళ్లలోని వస్తువులు కిందపడ్డాయి.
భూకంపం రావడంతో ప్రజలు రాత్రి మొత్తం ఇంటి బయటే ఉంటున్నారు. ఇటీవల సైతం ఇదే తరహాలు పలుమార్లు భూమి నుండి వింత శబ్దాలు వచ్చాయి. అయితే తరచూగా వస్తున్న భూ ప్రకంపనలపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి పొరల్లో శబ్ధాలు కొనసాగుతుడటంతో జనాలు హడలిపోతున్నారు. కొన్ని రోజుల కిందట చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో భూమి నుండి వింత శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. ఎం జరుగుతుందో తెలియక రాత్రంతా ఇళ్ల బయటే కూర్చొని జాగరం చేశారు.