రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు. ఫ్రూట్ బాస్కెట్స్, జ్ఞాపికలు ఇస్తుంటారు. ఇవేవీ వద్దు అని కూడా చెబుతారు. వీటి కోసం ఉద్యోగులు సొంత డబ్బులు ఖర్చు చేయడమో, ప్రోటోకాల్ నిధులను వెచ్చించడమో చేస్తున్నారనీ.. ఈ తరహా మర్యాదలు, సత్కారాలు ఎవరికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎవరికీ భారం కారాదన్నది ఉప ముఖ్యమంత్రి ఆలోచన.
గురువారంనాటి పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆలోచనలను చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు బోకేలు ఇవ్వడం , శాలువాలు కప్పడం వంటివి చేయలేదు. బోకేలు.. శాలువాలు హడావిడి లేనందుకు సంతోషంగా ఉందని చెబుతూ అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు. అధికారులతోపాటు పార్టీ నేతలకు సైతం పవన్ కళ్యాణ్ బోకేలు, శాలువాలు లాంటివి వద్దు అని పలుమార్లు చెప్పారు. వాటికి చేసే ఖర్చు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని శ్రేణులకు సూచించారు.