డ్రగ్స్ స్మగ్లర్ కారులో డీఎస్పీ షికార్లు చేశారంటూ ఆరోప‌ణ‌లు.. విచారణకు ఆదేశం

DSP uses smuggler’s seized vehicle to take family on drive. డ్రగ్స్ స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకున్న స్విఫ్ట్ కారును ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించడం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Feb 2023 12:37 PM GMT
డ్రగ్స్ స్మగ్లర్ కారులో డీఎస్పీ షికార్లు చేశారంటూ ఆరోప‌ణ‌లు.. విచారణకు ఆదేశం

డ్రగ్స్ స్మగ్లర్ నుండి స్వాధీనం చేసుకున్న స్విఫ్ట్ కారును ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించడం వివాదాస్పదం అయింది. స్విఫ్ట్ కారు నంబర్ ప్లేట్ మార్చిన తర్వాత దానిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి సునీల్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. గంజాయి కేసులో పట్టుబడ్డ ఓ నిందితుడి కారులో కుటుంబ సభ్యులతో కలిసి షికారుకు వెళ్లారు. అదే కేసులో పట్టుబడిన మరో కారు నెంబరు ప్లేటు తీసి దీనికి పెట్టారు. విశాఖపట్నం బీచ్ లో ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ ఢీకొట్టిన కారు యజమానితో రాజీపడటంతో కేసు నమోదు కాలేదు. ఆ వ్యవహారం మొత్తాన్ని అక్కడున్న వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

గతేడాది జులైలో గంజాయి తరలిస్తున్న నిందితులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలింపుకు ఉపయోగిస్తున్న కారును వదిలివెళ్లారు. ఆ కారు నెం. ఏపీ31 బీఎన్‌1116. జి.మాడుగలకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉంది. కశింపేట పోలీసులు ఆ కారును సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. జి.మాడుగులలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తోన్న రాజస్థాన్ కు చెందిన సింగ్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ కోసం పిలిపించారు. సింగ్ ను అరెస్ట్ చేయగా, తాను వేసుకొచ్చిన కారును తన తల్లికి అందజేయాలని కోరారు. ఆమె రాజస్థాన్ కు వెళ్లిపోవడంతో అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అప్పటి నుంచి పోలీసులు తమ అవసరాలకు ఆ కారునే వాడుకుంటున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన డీఎస్పీ సునీల్ ఆ కారు తీసుకొని విశాఖ బీచ్ కు వెళ్లారు. బీచ్‌ రోడ్డులో ఆయన ఒక వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కారు బండారం బట్టబయలైంది.

ఈ వ్యవహారంపై ఎస్పీ గౌతమి మాట్లాడుతూ.. డీఎస్పీ సునీల్‌ గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుడి కారులో ప్రయాణించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే, నంబరు ప్లేట్‌ మార్చడం మరో నేరమని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, పూర్తి నివేదికను వారికి పంపుతామని తెలిపారు.


Next Story