అమరావతి: మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా తీవ్ర ప్రకృతి విపత్తులను సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా ఎదుర్కొన్నాం. ఈ సారి కూడా పకడ్బందీ ప్రణాళికలతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది అందరినీ అప్రమత్తం చేశాం. వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు సేకరించాం. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టాం, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు . శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పంట నష్టం తగ్గించే సూచనలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా 24x7 రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నాం..అని తెలిపారు.
తుఫాను అనంతరం నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. మత్స్యకారులను అప్రమత్తం చేసి వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం, వారి వలలు, బొట్లు రక్షించుకునే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూగజీవుల ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాం. బలహీన పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు పాడి రైతులకు సూచనలు ఇచ్చాం. అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు తీసుకోకుండా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించాం. ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంది..అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.