గుండెపోటుతో నర్సీంపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ కన్ను మూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనమైంది. సుధాకర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నడిరోడ్డుపై పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురిచేసిన వీడియోలు బయటకు రావడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.

డాక్టర్ సుధాకర్ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని.. జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాస్కులు లేవని ప్రశ్నించిన పాపానికి ఆయనను శారీరకంగా, మానసికంగా జగన్ ప్రభుత్వం వేధించిందని అన్నారు. నడిరోడ్డుపై దుస్తులు తీసి మరీ వేధించిందన్నారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ సుధాకర్ మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మాస్క్ అడగడమే దళిత వైద్యుడు చేసిన నేరంగా, జగన్ ఆదేశాలతో రెక్కలు విరిచి కట్టి, కొట్టి, నానా హింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించడంతో సుధాకర్ బాగా కుంగిపోయారని తెలిసిందని అన్నారు. సామాన్య వైద్యుడిని వెంటాడి, వేదించి చివరకు ఇలా అంతమొందించారని లోకేశ్ విమర్శించారు. సుధాకర్ గుండెపోటుతో చనిపోలేదని, ప్రశ్నించినందుకు ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసిందని అన్నారు. నిరంకుశ సర్కారుపై పోరాడిన సుధాకర్ గారికి నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో ఉంటున్న డాక్టర్ సుధాకర్ శుక్రవారం ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందారు. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించగా.. సీబీఐకి కేసును అప్పగించింది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే ఆయన మరణించారు.


సామ్రాట్

Next Story