ఏపీలో తొలి నామినేషన్ వేసింది ఎవరో తెలుసా..?
నాలుగో దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఘట్టం మొదలైంది.
By Medi Samrat
నాలుగో దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఘట్టం మొదలైంది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఏపీలో అందరికంటే మొదటి నామినేషన్ వేశారు. ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పయ్యావుల తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ ఉదయం 11.05 గంటలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పయ్యావుల భార్య హేమలత, కుమారుడు విజయసింహ ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ కు సమర్పించారు. ఇక టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు.
మే 13న రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలోనూ, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు వేయాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ ను వేయనున్నారు. 19-04-2024న నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.