24 సీట్లేనా.. అభిమానులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ ఇదే.!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు.
By Medi Samrat
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ జనసేన తరుఫున ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జనసేన పార్టీ 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఐదు మందితో మాత్రమే జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ వంటి నేతల పేర్లు ఉన్నాయి. జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించటంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 సీట్ల కోసం ఇంత అవసరమా అని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు.
సీట్ల విషయంలో అసంతృప్తి వద్దంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు సూచించారు. పొత్తుల్లో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గాల్సి వచ్చిందన్నారు. కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దని.. విజయంలో 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రం లోని 40 నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం నంబర్ గానే చూడొద్దని, 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని అన్నారు. పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.