విద్యుత్ కోతలపై వదంతులను నమ్మవద్దు

Do Not Believe the Rumors on Power Cuts EPDCL. విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్

By Medi Samrat  Published on  16 Oct 2021 9:27 AM GMT
విద్యుత్ కోతలపై వదంతులను నమ్మవద్దు

విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సీఎండీ దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సంతోషరావు పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు. ఇదిలావుంటే.. విద్యుత్ స‌మ‌స్య‌పై రాష్ట్ర‌ప్ర‌భుత్వం, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది. బొగ్గు కొరత ఉంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందు నుంచే కేంద్రం హెచ్చరిస్తున్నా.. సీఎం జగన్‌ పట్టించుకోలేదని టీడీపీ నేత‌లు ఆరోపిస్తుండ‌గా.. దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభం తలెత్తితే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రాష్ట్రంలోనే విద్యుత్ కోతలు ఉన్నాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రులు అంటున్నారు. విదేశాల్లో బొగ్గు డిమాండ్ పెరగడం వల్లే ప్రస్తుత పరిస్థితికి కారణమని అధికార వైసీపీ నేత‌లు అన్నారు.


Next Story