గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించండి
గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని
By Medi Samrat Published on 4 Sep 2023 3:30 PM GMTగద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. గద్వాల నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి గెజిట్లో ప్రచురించాలని ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన డీకే అరుణ సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించే అఫిడవిట్‌లో కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదని గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ గుర్తిస్తూ తీర్పు వెలువరించింది.