వైసీపీ ప్రభుత్వం ఆసరాకు అర్థమే మార్చేసింది
Divyavani Fires On Govt. ఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా వేశారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు.
By Medi Samrat Published on 8 Oct 2021 2:16 PM GMTఆసరా పేరుతో జగన్ రెడ్డి మహిళలకు టోకరా వేశారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. కల్లబొల్లి మాటలతో, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చిన్న బిడ్డకు తల్లి ఒక ఆసరాగా ఉంటుంది. అలాంటిది వైసీపీ ప్రభుత్వం ఆసరాకు అర్థమే మార్చేసిందని మండిపడ్డారు. భార్యా భర్తలు ఒకరికొకరు ఆసరా. తోబుట్టువులు ఒకరికి ఒకరు ఆసరాగా ఉంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ ఏరియాకి ఆసరగా ఉంటారు. రాష్ట్ర ప్రజలకి ఆసరాగా ఉండాల్సిన సీఎం వారికి టోకరా వేశారని విమర్శించారు.
మహిళలకు డ్వాక్రా రుణమాఫీ, పసుపు-కుంకుమ ద్వారా దాదాపు రూ.21 వేల కోట్ల లబ్ధి చేకూర్చిన చంద్రన్న మీద నిందలు మోపుతున్నారు.. ఇది ఏ ఊరి న్యాయం? పులివెందుల న్యాయమా? లేక మరెక్కడి న్యాయమో చెప్పాలని దివ్యవాణి అన్నారు. చంద్రన్న దాదాపు 98 లక్షల మందికి కానుక ఇవ్వగా.. జగన్ దాన్ని 78 లక్షల మందికి కుదించారు. దీంతో 28 లక్షల మందికి పంగనామాలు పెట్టారు. 78 లక్షల మందిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అరకొర మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నారని.. ఇదేనా మీ ఆసరా పథకమని ప్రశ్నిస్తున్నానని అన్నారు.
సున్నా వడ్డీని దాదాపు రూ.5 లక్షల రుణం వరకు చంద్రబాబు వర్తింప చేయగా.. దాన్ని జగన్ రూ.3 లక్షలకు కుదించి మహిళలను మోసం చేస్తున్నారు. ఇదేనా జగన్ పరిపాలన?. పొదుపు సంఘాల పొదుపు జాతీయ బ్యాంకుల్లో జమ ఉన్న రూ.9 వేల కోట్ల పొదుపు సొమ్ము సహకార బ్యాంకులకు మార్చీ మహిళలను మోసం చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రన్న ఇచ్చిన పెళ్లికానుక రద్దు చేసి.. ఆయన ఇస్తానన్న కానుక ఎగ్గొట్టీ మహిళలను మోసం చేస్తున్నారు.. ఇదేనా మీరు ఆసరా పేరుతో మహిళను ఆదుకుంటున్నది? ప్రశ్నించారు.
ఈ రెండున్నర సంవత్సరాల్లో 600 మందికి పైగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని.. రౌడీలకు లైసెన్స్ లు ఇచ్చి మహిళలకు భద్రత లేకుండా చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నేరస్తులపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని.. మద్య నిషేదం చేస్తానని ఓట్లు కాజేసి.. మద్యం రేట్లు పెంచి పేద ప్రజల కుటుంబ ఆదాయాన్ని దోచుకుంటున్నారని.. దాదాపు రూ.25 వేల కోట్లు పేదల సొమ్ము మద్యం ద్వారా దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కల్లబొల్లి మాటలతో.. దౌర్జన్యాలతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. ఆ 20 సంవత్సరాలు ముందుకు తీసుకురావాలంటే చంద్రబునాయుడే గతి. ఇటీవల కొంతమంది లేచినప్పటినుంచి చంద్రబాబునాయుడను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. ఆయనను విమర్శించనిదే పొద్దు గడవదని అన్నారు.
పవన్ కల్యాణ్ రోడ్డు పైకి వచ్చి మాట్లాడినా అది చంద్రబాబునాయుడు ప్లానే అంటారు. ఎవరేం మాట్లాడినా చంద్రబాబునాయుడుకే అంటగడతారు. జగన్ తన సొంత బాబాయి విషయంలో.. చెల్లెలికి న్యాయం చేయలేక పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మహిళలను మోసం చేసే కేడీ పరిపాలన మానేసి.. దిశ లాంటి వాటిపై తక్షణమే మహిళలకు న్యాయం చేయాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కల్లబొల్లి మాటలతో మాయ పరిపాలన చేయకుండా.. సత్తా ఉన్న పరిపాలన చేయాలని ప్రభుత్వానికి సూచించారు.