ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 1వ తేదీనే 96శాతం పైగా ఫించన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఆగష్టు నెలకు సంబంధించి 64 లక్షల 82 వేల 52 వివిధ రకాల ఫించన్ల పంపిణీకి రూ.2737.41 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఈ మొత్తాన్నిబుధవారం మధ్యాహ్నం లోగా డ్రా చేసేందుకు ఎల్డియంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలక్టర్లకు స్పష్టం చేశారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది 1వ తేదీ ఇంటింటా వెళ్ళి 96 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని, 2వతేదీన నూరు శాతం ఫించన్ల పంపిణీనీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఫించన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆ సంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందున తదపురి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు.