ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. ఈ విష‌యాలు తెలుసుకోండి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుండే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల‌ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని..

By Medi Samrat  Published on  25 Oct 2024 11:17 AM GMT
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ.. ఈ విష‌యాలు తెలుసుకోండి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుండే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల‌ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని.. సంబందిత మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్థేశిస్తూ నేడే ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు రాష్ట్ర ఆహార మ‌రియు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఈ నెల 31 న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంచనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, తదుపరి వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆథార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 రేషన్ కార్డులు ఉన్నాయని, వీరిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది ప్రభుత్వం పై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్..

ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభించడం జరుగుతుంది, గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబందిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుందని, గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోనికి నేరుగా రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చని ఆయన తెలిపారు.

మూడు బ్లాక్ పీరియడ్లు..

ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీరియడ్లుగా పరిగణించడం జరుగుతుందని.. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు మరియు మూడో బ్లాక్ పీరియడ్ ను డిశంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.

ఈ పథకం అమలుకు సంబందించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో మాట్లాడం జరిగిందని, ఆయిల్ కంపెనీల వద్ద మరియు ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను అనుసంధాపరుస్తూ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలుకై ఆయిల్ కంపెనీలకు అడ్వాన్పుగా రూ.894.92 కోట్లను ఈ నెల 29 న చెక్కు రూపేణా చెల్లించడం జరుగుతుందన్నారు.

అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ.. రాష్ట్రంలో ఉన్న 1.55 గ్యాస్ కనెక్షన్లలో కేవలం 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం వర్తింపు అవుతున్నదన్నారు.

Next Story