ఏపీ శాసనమండలి రద్దు అంశంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ గురువారం రాజ్యసభలో ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు. శాసనమండలి రద్దుపై తీర్మానం చేసిన ప్రభుత్వం దాన్ని ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి పంపింది.
ఇదిలావుంటే.. గతంలో మండలిలో టీడీపీకి బలం ఎక్కువ ఉండేది. దాంతో పలు బిల్లులు అసెంబ్లీ ఆమోదానికి నోచుకున్నా, మండలి వద్దకు వచ్చేటప్పటికి వాటికి అడ్డంకులు ఎదురయ్యేవి. ఏపీకి మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో ఆమోదం పొందినా.. మండలిలో విముఖత పొందడానికి కారణం వైసీపీకి సరైన బలం లేకపోవడమే. ఈ నేపథ్యంలో, మండలిని రద్దు చేయాలంటూ జగన్ సర్కారు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఇటీవల కొత్త ఎమ్మెల్సీలు రావడంతో మండలిలో వైసీపీ బలం పెరిగింది. ఈ నేఫథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.