విజయవాడలో ఆత్మహత్యకు యత్నించిన దిశ సబ్‌ఇన్‌స్పెక్టర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ ఆత్మహత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. మంగళవారం నాడు దిశ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పని చేస్తున్న విజయ్ కుమార్ తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎస్సైకి చికిత్స అందిస్తున్నారు. ఎస్సై విజయ్ కుమార్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆత్మహత్య ఘటనపై ఎస్సై స్పందిస్తూ సీపీకి లేఖ రాశారు. దిశ ఏసీపీ నాయుడు వేధింపులతోనే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖలో పలు వివరాలను వెల్లడించారు. ఏసీపీ నాయుడు పెట్టే బాధలు భరించలేకే ఈ నిర్ణయానికి సిద్ధిపడినట్లు తెలిపారు. తనపై కక్షపూరితంగా వ్యహరిస్తున్నారని అన్నారు. నిజమైన కేసును తప్పుడు కేసుగా తన చేయిస్తున్నారని.. ఈ విషయాన్ని ప్రశ్నించింనందుకు వేధిస్తున్నారని తెలిపారు. అందరి ముందు తిడుతున్నారని, పైగా పరువు నష్టం దావా వేయిస్తానని బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎస్సై విజయ్ కుమార్ చేసిన ఈ ఆరోపణలతో విజయవాడ పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. అసలు నిజాలు రాబట్టేందుకు దర్యాప్తు చేపట్టాలని సీపీ శ్రీనివాసులు ఆదేశించారు. ఈ కేసును గవర్నర్‌పేట పోలీసులకు బదిలీ చేశారసి సమాచారం.