నిమజ్జనంలో మహిళా డాన్సర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలు.. దిశ యాప్‌కు కాల్ చేయ‌డంతో..

గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వచ్చిన మహిళా డాన్సర్ల పట్ల కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు.

By Medi Samrat  Published on  27 Sept 2023 7:09 PM IST
నిమజ్జనంలో మహిళా డాన్సర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలు.. దిశ యాప్‌కు కాల్ చేయ‌డంతో..

గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వచ్చిన మహిళా డాన్సర్ల పట్ల కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి సమయంలో యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి రక్షణ కల్పించారు. అల్లరి చేస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని, డాన్స్ గ్రూప్ సభ్యులను సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే...

విజయవాడ కు చెందిన ఐదు మంది సభ్యులు గల డాన్స్ గ్రూప్ బందరులో జరిగే వినాయక నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వెళ్లారు. ఈ డాన్స్ గ్రూప్ లో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు వున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో డాన్స్ గ్రూప్ లోని ఓ యువతి పట్ల స్థానికంగా వుండే కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధిత యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురిచేశారు. డాన్స్ గ్రూప్ లోని ఇతర సభ్యులు అడ్డుకోవడంతో పోకిరీలు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో బాధిత యువతి దిశ యాప్ కు వీడియో కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసిన ఎనిమిది నిముషాల వ్యవధిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతికి ధైర్యం చెప్పి భరోసాను కల్పించారు. ఊరి పెద్దమనుసులు జ్యోక్యం చేసుకొని పోకిరి యువకులను మందలించారు. బాధిత యువతి, ఇతర డాన్సర్ల సూచన మేరకు అల్లరి చేసిన యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం డాన్స్ గ్రూప్ లోని సభ్యులకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి విజయవాడ కు క్షేమంగా పంపించారు. తాము సురక్షితంగా ఇంటికి చేరే వరకు దిశ మహిళా సిబ్బంది ఫోన్ లో టచ్ లో ఉన్నారని బాధిత యువతి సంతోషం వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్నామని దిశ యాప్ కు కాల్ చేసిన నిముషాల వ్యవధిలోనే తమను రక్షించిన దిశ పోలీసులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story