బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖ జిల్లా వరకు స్వల్పంగా సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై మూడు పాయింట్లలోపే నమోదై ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే భూమి కంపించిందని.. ఇది ఫీబుల్ స్థాయిగా నిర్ధరణ అయిందని ప్రకటన ద్వారా వెల్లడించారు.
తెలంగాణ ములుగు జిల్లాలో 5.3 తీవ్రత నమోదు కాగా.. ఏపీలో రాజమండ్రి వరకు 230 కిలోమీటర్లు వాయువ్య దిశలో దాని ప్రభావం 2.9 లోపుగా ఉంటుంది.. ఏపీలో చాలా స్వల్ప స్థాయిలో భూమి కంపించిందని.. 12 స్థాయిలతో కూడిన భూకంప తీవ్రత జాబితాలో ఇది రెండో స్థానమేనని కూర్మనాథ్ వెల్లడించారు. దీన్ని ఫీబుల్ స్థాయి అని పిలుస్తారని ఆయన చెప్పారు. ఫీబుల్ స్థాయిలో భూకంపం సంభవిస్తే ఎటువంటి ప్రమాదాలకు అవకాశం ఉండదని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. సిస్మిక్ జోన్ పరంగా చూసినా ప్రస్తుతానికి ఏపీ సేఫ్ జోన్‌లోనే ఉందని తెలిపారు.