కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు
DIG Trivikram Varma Press Meet. గుంటూరు జిల్లాలో జరిగిన ఆడపిల్లల హత్య కేసులో పోలీసులు నిందితులను వెంటనే
By Medi Samrat
గుంటూరు జిల్లాలో జరిగిన ఆడపిల్లల హత్య కేసులో పోలీసులు నిందితులను వెంటనే పట్టుకోవడం జరిగిందని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ అన్నారు. కొంతమంది మాత్రం దిశా చట్టం మీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కింద చాలా కేసులు నమోదు చేసామని.. ఇప్పటికే దిశా యాప్ నుంచి ప్రతిరోజు ఫోన్‌లు వస్తున్నాయని.. వెంటనే పోలీసులు స్పందిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఏడు రోజుల లోపల 1600 కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారని అన్నారు.
ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దిశా చట్టం అనేది నేటి సమాజానికి ఒక సంరక్షణ కలిగించే గోడుగులాంటిదని అన్నారు. నెల్లూరులో జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. దిశా చట్టం వచ్చిన తర్వాత దిశ యాప్ 47లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రతిఒక్కరికి అందుబాటులో వుండేటట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు నరసరావుపేట లో జరిగిన ఘటనలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు. రేపు టీడీపీ నేత లోకేష్ పర్యటనకు అనుమతిలేదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈరోజు డీఐజీ, ఎస్పీలు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు లోకేష్ పర్యటన రాజకీయంగా ఉందని.. అనుమతిలేని పర్యటనలకు రాజకీయ నాయకులు రావద్దని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలకు అభినందనలు తెలియజేశారని తెలిపారు.
అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ.. రమ్య హత్యఘటనలో అర్బన్ పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పండుగ చేసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామన్నారు.