ఎలాగైనా సరే వర్షాలను ఆపేయాలని ఏపీ సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారా..?
Did AP CM Jagan order the collectors to stop the rains anyway. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు-వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 22 Nov 2021 11:17 AM GMTఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు-వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే..! అయితే ఎలాగైనా సరే వర్షాలను ఆపేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు అనే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సదరు ట్వీట్ చేసిన ట్విట్టర్ పేజీని చూడగా.. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ అసలు కనిపించలేదు. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లకు చేసిన ఆదేశాలకు సంబంధించిన ప్రకటనలను మేము పరిశీలించగా.. ఎక్కడా కూడా వర్షాలను ఆపేయాలని ఏపీ సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించలేదని తెలుస్తోంది.
చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని.. వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండని సూచించారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలని.. వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలని తెలిపారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలన్నారు. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదని.. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని సూచించారు. విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు.
ఈ వరదలను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలన్నారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వాలన్నారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బు ఇవ్వాలని.. దీంతో పాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరుచేయండని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5200 నగదు వెంటనే అందించేలా చూడాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండని సూచించారు.
నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని.. రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సూచించారు. చెరువులు, ఇతర జలాశయాలు, గట్టుమీద దృష్టిపెట్టాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండండాలని.. ఎప్పటికప్పుడు వారు నివేదికలను అధికారులకు అందించాలన్నారు.
- వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.