వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ విమర్శించారు. పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదని.. ఫలితాలపై విద్యా శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించకుండా.. తల్లితండ్రులపై నెట్టడం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం అని తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాలు కోవిడ్ సమయంలో విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద ఉంచిందని ఆరోపించారు.
పదవ తరగతి విద్యార్థుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలుగా భావించాలని అన్నారు. విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చేరాలని బలవంతపెట్టడం దారుణం అని అన్నారు. ఐటీ రంగంలో తెలుగువారు ముందుండడం చంద్రబాబు ఘనతేనని అన్నారు. ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేయడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు లాంటి విజనరీ సీఎంకి, జగన్ లాంటి ప్రిజనరీ ముఖ్యమంత్రికి తేడా తెలుస్తోందని ధూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు.