నెరవేరిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల
పిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది.
By Medi Samrat Published on 16 Dec 2024 7:48 PM ISTపిఠాపురం నియోజకవర్గ ప్రజల కల నెరవేరింది. ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సోమవారం జీవో ఎంఎస్ 156 నంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పిఠాపురం ఆస్పత్రి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రత్యేక సౌకర్యాలు, అదనపు సిబ్బంది రానున్నారు.
ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వసతుల పెంపు కోసం రూ.38.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు. పెరిగిన ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. అదనపు విభాగాలు రానున్నాయి.
పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి-ముక్కు-గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలలలోపునే అమలు కావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యవసతులు కల్పన సాధ్యమవుతోంది. పిఠాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాలతోపాటు సమీపంలో పలు నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.