ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకొంటూ తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన దరిమిలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి విదితమే. మంగళవారానికి దీక్ష మూడో రోజుకు చేరుకుంది. 11 రోజుల దీక్షను తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకొని విరమిస్తారు. 2వ తేదీన తిరుమల కొండపై ఉంటారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.