పవన్ కళ్యాణ్ విమర్శలు మొదలుపెట్టేసినట్లే..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 22 Jun 2024 9:15 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని అన్నారు. ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందన్నారు. సభలో ప్రత్యర్థులను తిట్టే అవకాశం కోల్పోయిన అయ్యన్న పాత్రుడు.. తిట్టే సభ్యులను నియంత్రించాల్సిన బాధ్యత చేపట్టడం సంతోషంగా ఉందని.. స్కూలులో అల్లరి పిల్లవాడిని క్లాస్ లీడర్ గా చేసినట్లుగా ఉందని అన్నారు. భాష నియంత్రణ సభ నుంచే మొదలుకావాలని, గౌరవ స్పీకర్ ఆ బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.
సభలో చిన్నా పెద్ద నాయకుడనే తేడా లేకుండా వ్యక్తిగత దూషణ గత సభలలో చూసి ప్రజలతో పాటు తనకూ బాధేసిందని చెప్పారు. భాష మనుషులను కలిపేందుకే కానీ విడగొట్టడానికి కాదని, విద్వేషాలు రేపడానికి అంతకంటే కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సభ హుందాగా నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, చర్చల పేరుతో అసభ్య పదజాలం వినిపించకుండా చూడాలని కోరారు. గతంలో సభలో జరిగిన తిట్ల పురాణం వల్ల ప్రజలు విసిగిపోయి, వారిని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారని పవన్ అన్నారు. విజయాన్ని ఆహ్వానించడం మాత్రమే వారికి తెలుసని, ఓటమిని ఒప్పుకోలేక సభ నుంచి పారిపోయారన్నారు.