మే 12 నుండి 17 వరకూ విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక శ్రీలక్ష్మీ మహాయజ్ణం

Deputy Chief Minister Kottu Satyanarayana. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి ప్రజలు సౌభాగ్యంతో ఉండాలని సనాతన ధర్మాభివృద్ధే లక్ష్యంగా

By Medi Samrat  Published on  21 April 2023 3:45 PM GMT
మే 12 నుండి 17 వరకూ విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక శ్రీలక్ష్మీ మహాయజ్ణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి ప్రజలు సౌభాగ్యంతో ఉండాలని సనాతన ధర్మాభివృద్ధే లక్ష్యంగా మే 12 నుండి 17 వరకూ విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ణాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 108 కుండాలతో అద్భుత, అపూర్వమైన అఖండ పుణ్య ప్రదాయకమైన మహా యజ్ణాన్నినిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈమహా యజ్ణ క్రతువు 12వ తేదీ ఉ.5గం.లకు బ్రహ్మ ముహూర్త కాలంలో గోపూజ విఘ్నేశ్వర పూజ అజప్ర దీపారాధన కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందని చెప్పారు. మిగతా రోజుల్లో ఉదయం 9గం.ల నుండి ప్రారంభం అవుతుందని ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. 108 కుండాలే కాకుండా యాగాలు శ్రీరాజశ్రీ కుండం వంటివి నిర్వహిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ ఆరు రోజుల మహా యజ్ణం కార్యక్రమంలో వివిధ ప్రతిష్టాత్మక పీఠాధిపతులు పాల్గొని వారి ప్రవచనాలు ద్వారా ప్రజలకు అనుగ్రహ ఆశీర్వచనాలు అందిస్తారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యంగా కంచికామకోటి, పుష్పగిరి, శృంగేరి, చినజియర్ స్వామి తదితర పీఠాధిపతులు పాల్గొంటారని తెలిపారు. అంతేగాక చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ వంటి ప్రవచన కర్తలు కూడా పాల్గొని ప్రజలకు వివిధ ప్రవచనాలు ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ తదితర అంశాలను తెలియజేస్తారని చెప్పారు. ఆరు రోజుల్లోను ప్రతి రోజు ఒక దివ్యకళ్యాణం జరుగుతుందని తెలిపారు.

తొలి రోజు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్యకళ్యాణం ఉంటుందని చెప్పారు. రెండవ రోజు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యకళ్యాణం, మూడవ రోజు శ్రీశైలం శ్రీబ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల కళ్యాణం, నాల్గవ రోజు ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం,ఐదవ రోజు సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణాలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అంతేగాక రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దేవాలాయాలకు చెందిన హిందూ ధర్మ ప్రచార రధాలు కూడా మహాయజ్ణ ప్రాంగణంలో ప్రజల దర్శనార్ధం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మహాయజ్ణం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా వివిధ శాఖల అధికారులతో కూడిన 14 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.


Next Story