తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది.
By - Knakam Karthik |
తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసుకు సంబంధించిన మీడియా కథనాలపై దాఖలైన పరువు నష్టం దావాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అమిత్ బన్సాల్, వివాదాస్పద కథనాలపై ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ఎక్స్‌పార్టే అడ్ ఇంటిరిమ్ ఇంజంక్షన్ ఇవ్వడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఈ దశలో ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అయితే, ఈ రోజు తర్వాత ఈ అంశంపై జరిగే ఏవైనా కొత్త ప్రచురణలు, పోస్టులు లేదా కథనాలు కోర్టు నోటీసులోకి వచ్చినట్లేనని, వాటికి తగిన పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.తిరుమల లడ్డూ కల్తీ కేసులో జంతు కొవ్వులు లేదా చేప నూనె కలిసిన నెయ్యి వాడారన్న ఆరోపణలు రావడంతో, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ కోసం స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ పరువు నష్టం దావాను వై.వి. సుబ్బారెడ్డి మరియు ఆయన భార్య కలిసి దాఖలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో (టీటీడీ) లడ్డూ ప్రసాదానికి నెయ్యి కొనుగోలు వ్యవహారంలో తాము అక్రమాలకు పాల్పడ్డారన్న రీతిలో మీడియా సంస్థలు తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలు ప్రచురించాయని వారు కోర్టుకు తెలిపారు. వై.వి. సుబ్బారెడ్డి 2019 జూన్ నుంచి 2023 ఆగస్టు వరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం కోర్టు రికార్డులోకి వచ్చింది. ఎక్స్‌పార్టే అడ్ ఇంటిరిమ్ ఇంజంక్షన్లు అత్యంత అపూర్వ పరిస్థితుల్లోనే ఇవ్వాల్సి ఉంటాయని, ఈ కేసులో అటువంటి పరిస్థితులు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదులకు సమన్లు జారీ చేసిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులపై దాఖలైన అభ్యర్థనను కూడా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని తదుపరి విచారణకు జనవరి 29కి వాయిదా వేసింది.