ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత

ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు.

By -  Knakam Karthik
Published on : 2 Dec 2025 1:13 PM IST

Andrapradesh, Cyclone Montha, damage report, Central Government, Amit Shah, Nara Lokesh, Anitha

ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత లు భేటీ అయి మొంథా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు. తుపాను కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో గాలులతో భారీవర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులను అందించింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3వేలు అందించాం. ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి. ఈనెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం (IMCT) ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమిత్ షాను కలిసిన వారిలో హోం మంత్రి అనిత, రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఉన్నారు.

Next Story