ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ

Cyclone alert for andhra pradesh. ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. ఇది ముఖ్యంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

By అంజి  Published on  13 Nov 2021 7:02 AM GMT
ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. ఇది ముఖ్యంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ దక్షిణ అండమాన్‌ సమీపంలో అల్పపీడన ద్రోణి ఏర్పడి.. ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఎల్లుండి నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్‌ ఉంది. ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒక వేళ తుఫాన్‌ వస్తే దానికి జవాద్‌ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై తుఫాన్‌ తన ప్రభావం చూపించనుందని అధికారులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా ఇంకా చాలా గ్రామాలు, పట్టణాలు నీటిలోనే దిగ్బంధం అయ్యాయి. దక్షిణ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా కన్యాకుమారి నుండి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవాళ నెల్లూరు జిల్లా, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై.. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భీకర వానలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఒక చిత్తూరు జిల్లాలోనే రూ.4 కోట్ల పంటనష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. చిత్తూరు జిల్లాలో గత 36 గంటల్లో 18 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో నదులు ఉధృత రూపం దాల్చాయి.

Next Story