సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను కదిలించి వేసింది. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఏ ఒక్క సినీ రంగానికి చెందిన ప్రముఖులు వెళ్లి ఆ బాలుడిని పరామర్శించలేదు. కానీ ఒక్కరోజు కేవలం కొన్ని గంటలు మాత్రమే జైల్లో ఉన్నందుకు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ కి కాళ్లు పోయాయా లేక చేతులు పోయాయా ఎందుకు ప్రముఖులందరూ అతన్ని పరామర్శించడం కోసం లైన్ కట్టారు.. అదే హాస్పిటల్లో ఉన్న చిన్నారిని చూడడానికి మాత్రం ఎవరికీ మనసు రావడం లేదా.. అంటే పేదవారి ప్రాణానికి విలువ లేదా.. అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు, ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం వ్యక్తం చేశారు.