వరద బాధితులను ఆదుకోమంటే అరెస్టులు చేసి జైల్లో పెడతారా?

CPI Ramakrishna Fires On AP Govt. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ అనంతపురంలో

By Medi Samrat  Published on  28 Nov 2021 4:32 PM IST
వరద బాధితులను ఆదుకోమంటే అరెస్టులు చేసి జైల్లో పెడతారా?

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ అనంతపురంలో మంత్రి బొత్స సత్యనారాయణకు విన‌తి పత్రం సమర్పించేందుకు వెళ్ళిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయ‌న ఒక‌ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీ లోని 4 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అందులో అనంతపురం జిల్లాలో పెను నష్టం సంభవించింది. చేతికొచ్చిన పంటలు నీటమునిగి రైతాంగం కుదేలయింది. వేరుశనగ, కంది, ప్రత్తి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఈ నేపథ్యంలో అనంతపురంలో పర్యటిస్తున్న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి బొత్స సత్యనారాయణకి వరద నష్టాన్ని వివరించి, తక్షణ సహాయం కోరేందుకు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థి, యువజన నేతలను అరెస్టు చేసి నిన్నటి నుండి నిర్బంధించారు. ఈ రోజు అరెస్టు చేసిన 9 మందిని కోర్టులో హాజరుపరచి జైలుకు పంపారు. పోలీసుల వైఖరిని, ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా ప్రయోజనాల కోసం పాలకులకు విజ్ఞప్తి చేయడం కూడా నేరమేనా? విద్యార్థి, యువజన నేతలను నేరస్థులుగా పరిగణించటం తగునా? పోలీసులంటే ప్రజా రక్షకులా లేక ప్రభుత్వ పక్షపాతిలా? అని ప్రశ్నిస్తున్నాం. శాంతియుత విజ్ఞప్తులపై, నిరసనలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపడం దుర్మార్గం. పోలీసులు విద్యార్థి, యువజన నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌నలో తెలిపారు.


Next Story