ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు సంధించారు. ఏపీ లో జగన్ నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రధాని మోదీ కనుసన్నల్లో పని చేస్తూ జగన్ భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్సార్ లు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పనిచేశారని.. అయితే వాళ్ల వారసులుగా వచ్చిన చంద్రబాబు, జగన్‌లు మోదీకి సరెండర్ అయిపోయారని ఆరోపించారు. మోదీ వైఫల్యాలను కనీసం ప్రశ్నించలేక పోతున్నారన్నారు.
కేంద్రం మెడలు వంచుతా అన్న జగన్.. మోదీ ముందు మెడ వంచారని విమర్శించారు. ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ, నిధులపై పోరాటాలు లేవన్నారు. వాట్సప్‌లో టీడీపీ, వైసీపీ పోరాటం చేసుకుంటున్నాయని తెలిపారు. మోదీని కలిసి షేక్ హ్యాండ్ ఇస్తే, భోజనం చేస్తే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సిగ్గు, శరం లేకుండా వాటిపై సొంత డబ్బా కొట్టుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల, విజయసాయి రెడ్డిల వ్యాఖ్యలు వారిలో భయాన్ని తెలియజేస్తున్నాయన్నారు. చంద్రబాబు, జగన్‌లు రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా మోదీపై ఒత్తిడి తేవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.