నూతన జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా.. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని తప్పుబట్టారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం విచారకరమని విమర్శించారు. నూతన జిల్లాల ఏర్పాటు కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందినది కాదని దుయ్యబట్టారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో మమేకమై ఉంటే బావుండేదనే అబిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష, నిరంకుశ విధానాలను ఇకనైనా మానుకోవాలని హితువు పలికారు.