బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతిభ్రమించినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో అని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని ఫైర్ అయ్యారు. కోటి మంది మందుబాబులు ఉన్నారని.. వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని విమర్శించారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో కోటి ఓట్లు వస్తే రూ.70లకే మద్యం అందజేస్తామని ఆంద్రప్రదేశ్ బీసేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాక ఆదాయం మిగిలితే మద్యం ధర రూ.50కి తగ్గిస్తామన్నారు. మంగళవారం విజయవాడలో ప్రజాగ్రహ సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి కోటి ఓట్లు వేయండి.. కేవలం రూ.70కే మద్యం అందజేస్తాం.. ఇంకా ఆదాయం మిగిలితే రూ.50కే మద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అధిక ధరకు మద్యాన్ని వినియోగిస్తున్నారని, చీప్ లిక్కర్ కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.