తూర్పు గోదావరి జిల్లా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. జైలులో రిమాండ్ లో ఉన్న తనకు బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టుకు పెట్టుకున్న పిటిషన్‌ను మరోసారి కొట్టివేసింది. రిమాండ్‌ను రాజమండ్రి కోర్టు ఈనెల 29 వరకు పొడిగించింది. దీంతో ఎమ్మెల్సీని రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపిన కేసులో ఎమ్మెల్సీ తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలులో ఉంచారు.
గత రెండు నెలల నుంచి అనంతబాబు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం హత్య పై ఛార్జ్ షీట్ నమోదు చేయకుండా చాలా జాప్యం చేస్తున్నారని గతంలో పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే..! ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.