చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడంపై వివాదం

Controversy over awarding Gurjada award to Chaganti Koteswara Rao. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరొందిన చాగంటి కోటేశ్వరరావును

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 27 Nov 2022 4:30 PM IST

చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడంపై వివాదం

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరొందిన చాగంటి కోటేశ్వరరావును గురజాడ పురస్కారానికి ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. నవంబరు 30న నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు అవార్డు ప్రదానం చేయాలని నిర్వాహకులు భావించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారాన్ని ప్రకటించడంపై కవులు, రచయితలు, కళాకారులు విజయనగరంలోని గురజాడ నివాసం నుండి నిరసన ర్యాలీకి దిగారు. ప్రతి సంవత్సరం గురజాడ పురస్కారాన్ని అందిస్తుంటారు. ఈ ఏడాది గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు అందించడంపై నిరసనలు వెల్లువెత్తాయి.

గురజాడ భావ జాలానికి భిన్నమైన చాగంటి కోటేశ్వరరావుకు ఈ అవార్డును అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యుదయ భావజాలం ఉన్న హేతువాదిగా గురజాడ అప్పారావు కొనసాగారని, కానీ చాగంటి కోటేశ్వరావు అందుకు పూర్తి విరుద్ధమైన వ్యక్తి అని, నిత్యం దేవుడి గురించి చెబుతూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే వ్యక్తి అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరంలోని గురజాడ అప్పారావు ఇంటి నుంచి నిరసన కార్యక్రమం చేపట్టారు. గురజాడ గౌరవయాత్ర పేరుతో సాహితీ, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురజాడ అవార్డును చాగంటికి ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు. పట్టణంలోని గురజాడ విగ్రహం వద్ద కవులు, కళాకారులు ఆందోళన జరిపారు.


Next Story