వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నాడు జరిగిన కార్యక్రమంలో మంత్రి కారుమూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారుడు ఏ వస్తువు ను ఎక్కడా కొనుగోలు చేసినా.. దానికి సంబంధించి ఏదైనా మోసానికి గురయితే.. తన నివాసం నుంచే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలైనా, లేక పట్టణ ప్రాంతాల్లో నుంచైనా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉందని మంత్రి వివరించారు. అలాగే కల్తీని నిరోధించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ తదితర వాటి కొలతల విషయంలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. బంగారం తూకాలు, అందులో మోసాలకు సంబంధించి దాడులు నిర్వహించి అక్రమార్కులపై కేసులు నమోదు చేశామని వివరించారు. తమ ప్రభుత్వం వినియోగదారుల హక్కుల రక్షణలో ఎలాంటి రాజీ పడదని మంత్రి స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు వర్ధన్, ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.