విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం అన్నారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడితే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎల్‌ఐసీని ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని అర్థంలేని నిర్ణయమని కాంగ్రెస్ నేత అభివర్ణించారు. గురువారం కర్నూలు జిల్లా యెమ్మిగనూరు మండలం బనవాసి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో మూడో రోజు యాత్రను పునఃప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యా కుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమై ఇది 43వ రోజు. యెమ్మిగనూరు మండలం బనవాసి నుంచి ప్రారంభమైన యాత్ర ముగటి, హాలహర్వి గ్రామాలను తాకుతూ మండలంలోని కల్లుదేవ కుంట గ్రామం వరకు కొనసాగింది.
పాదయాత్ర పొడవునా సంబంధిత గ్రామాల వాసులు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు. భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ నాయకుడితో పాటు వేలాది మంది ప్రజలు కూడా నడిచారు. కల్లుదేవ కుంట నుంచి యాత్రను పునఃప్రారంభించిన అనంతరం పలువురు పలు సంఘాల నేతలు రాహుల్ గాంధీని కలిసి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై వాపోయారు. పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ప్రత్యేక హోదా విభజన హమీల సాధన సమితి నాయకులు, ఏపీ నిరుద్యోగ యువత, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. బనవాసి నుంచి కల్లుదేవ కుంట వరకు ఆయన యాత్ర ప్రారంభించినప్పటి నుంచి రాహుల్ గాంధీని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కర్నూలు జిల్లాలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న భారత్ జోడో యాత్ర చివరి రోజైన శుక్రవారం కల్లుదేవ కుంట నుంచి యాత్ర ప్రారంభించి మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ముగియనుంది. మంత్రాలయంలో ఆగే సమయంలో, రాహుల్ గాంధీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుంటారు. సుభుదేంద్రతీర్థులతో సంభాషించనున్నారు.