రాష్ట్రంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారం అందించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం రూ. 46 కోట్లు మొత్తాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. 2020 - ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు విడుదల చేసిన మ్యాచింగ్ గ్రాంట్ ను ఏపీ అడ్వకేట్స్ సంక్షేమ నిధి ఖాతా కు జమచేస్తామని తెలిపారు. మరణించిన ఒక్కొక్క న్యాయవాది కుటుంబానికి న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ఇచ్చే మొత్తానికి అదనంగా ప్రభుత్వం తరపు పరిహార భాగంగా రూ. 4 లక్షలు చొప్పున వారి నామినీలకు అందజేయడం జరుగుతుందని మంత్రి ఫరూక్ తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పర్యవేక్షణలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు సంబంధించిన నామినీలకు పరిహారం మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో న్యాయవాదుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని న్యాయశాఖ మంత్రి ఫరూక్ ద్వజమెత్తారు.గత ప్రభుత్వ హయాంలో దివంగత న్యాయవాదుల కుటుంబాలను జగన్ ప్రభుత్వం ప్రభుత్వంబాధ్యతారాహిత్యంగా గాలికి వదిలేశారని మంత్రి ఫరూక్ దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కార్యాచరణ బద్ధంగా ప్రభుత్వం అన్ని సంక్షేమ చర్యలను చేపడుతున్నదని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.