సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష

గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

By Medi Samrat
Published on : 5 Sept 2025 7:45 PM IST

సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష

గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో దీనిపై చర్చించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జూలై, ఆగస్ట్ నెలల్లో ఈ గ్రామం నుంచి 20 మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని... ముందుగా అనుమానిత లక్షణాలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అన్నికోణాల్లోనూ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం శని, ఆది వారాలు ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం పంపించాలని... గ్రామంలోని అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. అక్కడ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలన్నారు. అనారోగ్య తీవ్రత ఎక్కువుగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.

కేంద్ర వైద్య బృందాల సాయం తీసుకోండి:

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించండి...అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి... పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా వ్యవహరించండి. తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించండి. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించండి. ప్రతీ రోగిని వైద్య పర్యవేక్షణలో ఉంచాలి. హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలి. కొత్త కేసులు ఏమాత్రం నమోదుకాకూడదు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలి... స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలి. జ్వరంతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.’ అని సీఎం సూచించారు.

72 గంటల్లో రిపోర్టులు:

మరోవైపు తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే ‘మెలియోయిడోసిస్’ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపడం జరిగిందని... 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పశుపోషణ పైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని... అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు.

మెలియోయిడోసిస్:

మెలియోయిడోసిస్ ప్రధానంగా భూమిలోనూ, నిల్వ నీరులో, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు... వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు... రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా గాయాలు లేదా చర్మ పగుళ్లు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. కాలుష్యమైన నీరు తాగినా, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా సంక్రమించవచ్చని చెప్పారు.

Next Story