చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్

చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీ కుట్రపూరితంగా మూసేశారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

By అంజి  Published on  4 July 2023 8:28 AM GMT
CM YS Jagan, Chandrababu, APnews

చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్

చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీ కుట్రపూరితంగా మూసేశారని సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా చిత్తూరు డెయిరీని మూసేశారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను నిలువునా ముంచేశారని, అయితే తాము చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని అన్నారు. ఇవాళ చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్‌ భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. చంద్రబాబు పాలనా కాలంలో చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందన్నారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే.. హెరిటేజ్ డెయిరీ మాత్రం లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసిందన్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. రూ.182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీ ఓపెన్‌ చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టులో అమూల్‌ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు.

ఈ డైయిరీ ద్వారా చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని తెలిపారు. 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుందన్నారు. అమూల్‌ రాక ముందు లీటర్‌ గేదె పాల ధర రూ.67 ఉంటే.. అమూల్‌ వచ్చాక లీటర్‌ గేదె పాల ధర 89 రూపాయల 76 పైసలకు పెరిగిందన్నారు. అమూల్‌ రాక ముందు ఆవుపాలు లీటర్‌ ధర రూ.32 కూడా లేదు. అమూల్‌ వచ్చాక ఆవు పాలు లీటర్‌ ధర 43 రూపాయల 69 పైసలు అని తెలిపారు. చంద్రబాబు, రామోజీలు కలిసి.. వెల్లూరు మెడికల్‌ కాలేజ్‌ రాకుండా అడ్డుకున్నారని, అయితే అన్ని అడ్డంకులను దాటుకుని వెల్లూరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నామని అన్నారు. చంద్రబాబు హయాంలో చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఒక్కటి కూడా లేదని సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

చంద్రగిరిలో గెలిచే అవకాశాలు తక్కువ అని కుప్పం వెళ్లిన చంద్రబాబును చూసి.. అక్కడి ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని సీఎం జగన్‌ ఎద్దేవా చేశారు. మరోసారి కుప్పం ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నాడని విమర్శించారు. కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానని డ్రామాలు ఆడుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. మామకు వెన్నుపోటు పొడిచిన సంగతి ఇప్పటి తరానికి తెలియదని బాబు నమ్ముతున్నాడని, చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాన్ని నమ్ముకున్నాడని అన్నారు. మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగు ఉండండి అని సీఎం జగన్‌ కోరారు. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, విష ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. దత్తపుత్రుడి కలిసి చంద్రబాబు అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు. ఇవాళ పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్‌ అన్నారు.

Next Story