వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన 2000 గ్రామాల్లో సమగ్ర భూ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను అధిగమించి పూర్తి చేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధంగా ఉన్న గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వేలను శాస్త్రీయంగా చేపడుతున్నామన్నారు.
17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని, రెండేళ్ల క్రితం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మొదటి దశలో 2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల పరిశీలన చేసి 7,92,238 మంది రైతులకు భూమి పట్టా పత్రాలు అందించామని వైఎస్ జగన్ తెలిపారు. ఫిబ్రవరిలో రెండో విడతగా 4 వేల గ్రామాల్లో, మే 2023 నాటికి 6 వేల గ్రామాల్లో, ఆగస్టు 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే పూర్తి చేస్తామని సీఎం జగన్ అన్నారు.
సివిల్ కేసుల్లో అత్యధికంగా భూ వివాదాలే ఉన్నాయని, సరైన వ్యవస్థ లేకపోవడంతో రైతులు భూములు కోల్పోతున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితులను మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా కొలిచి మార్కింగ్ చేసి ప్రతి భూమికి గుర్తింపు సంఖ్యను ఇస్తామని రైతులకు భూమి హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. రూ.1000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని వైఎస్ జగన్ తెలిపారు. లంచాలకు ఆస్కారం లేకుండా భూ సమస్యలను పరిష్కరించేందుకు 13,840 మంది సర్వేయర్లను నియమించారు.